కోల్కతా, అక్టోబర్ 17: కోల్కతా దుర్గా నవరాత్రి ఉత్సవాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఉత్తర కోల్కతాలో ఏర్పాటు చేసిన దుర్గా మండపంలో శనివారం సాయంత్రం జరిగిన తొక్కిసలాటలో 17 మంది భక్తులు మరణించగా, 40 మందికి పైగా గాయపడ్డారు. సప్తమిని పురస్కరించుకుని దుర్గామాతకు పూజలు ఆచరించడానికి పెద్దయెత్తున భక్తులు రావడంతో ఒక పక్క వర్షం పడుతుండగా జరిగిన తొక్కిసలాటలో ఈ విషాదం చోటుచేసుకుంది. శారదా పార్క్ వద్ద ఏర్పాటు చేసిన దుర్గా మండపంలో ఈ తొక్కిసలాట చోటుచేసుకుందని పోలీసులు చెప్పారు.
ఒక పక్క వర్షం పడుతున్నా భక్తులు పెద్దయెత్తున రావడంతో ఈ ఘటన జరిగిందని తెలిపారు. మృతుల్లో 13 మంది మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. క్షతగాత్రులను కోల్కతా మెడికల్ కాలేజీ దవాఖానకు తరలించారు. పోలీసులు, విపత్తు నిర్వహణ, ఫైర్ బ్రిగేడ్ అధికారులు ఘటనా స్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. మండప నిర్వాహకులు కూడా బాధితులకు సహాయం అందించారు. ఘటనా స్థలి అంతా అంబులెన్స్ల సైరన్లు, బాధిత కుటుంబాల ఆర్తనాదాలతో నిండిపోయింది.