దేశంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులందరూ ఒకే వేదికపై కలుసుకోవడం అనేది ఒక కలలానే భావిస్తుంటాం. కానీ తెలంగాణ రాష్ట్రంలో బండారు దత్తాత్రేయ నిష్కల్మషమైన వ్యక్తిత్వంతో, రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా, సిద్ధాంతాలతో సంబంధం లేకుండా, ప్రాంతీయ భేదాలకు తావులేకుండా నాయకులందరినీ ఆత్మీయంగా కలిపే కార్యక్రమమే అలయ్ బలయ్.
మనసారా మాట్లాడుకోవడానికి, ఆత్మీయతను పంచుకోవడానికి ఏర్పాటు చేసిన ఒక గొప్ప పండుగ అలయ్ బలయ్. ప్రపంచంలో మానవ విలువలు కనుమరుగవుతున్నవేళ, మనుషులుగా మనం ఏ రంగంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, అందరం కలిసిమెలిసి ఉండాలని, ప్రజలందరి మధ్య సోదరభావం వెల్లివిరియాలని సంకల్పిస్తూ 2005లో దత్తన్న అలయ్ బలయ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.