అంతరిక్షంలో రష్యా, ఉక్రెయిన్ మధ్య మరో కొత్త ఉద్రిక్తతకు తెరలేచింది. ఉక్రెయిన్ సైన్యానికి సహాయం చేస్తున్న ఒక వాణిజ్య ఉపగ్రహానికి రష్యాకు చెందిన సైనిక ఉపగ్రహం అత్యంత దగ్గరగా వెళ్లడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రష్యా ఉపగ్రహం ఉద్దేశపూర్వకంగానే తన కక్ష్యను మార్చుకుని ఉక్రెయిన్‌కు ఉపయోగపడుతున్న ఉపగ్రహానికి దగ్గరగా వెళ్లినట్లు సమాచారం. దీంతో రష్యా అంతరిక్షం నుంచి పాశ్చాత్య దేశాలకు చెందిన ఉపగ్రహాలపై నిఘా పెట్టిందా ? వాటి పనితీరుకు ఆటంకం కలిగించే ప్రయత్నం చేస్తోందా ? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అసలు అంతరిక్షంలో ఏం జరిగింది? రష్యాకు చెందిన కోస్మోస్ 2612 అనే సైనిక ఉపగ్రహం, ఫిన్లాండ్కు చెందిన ICEYE సంస్థ నిర్వహిస్తున్న ICEYE-X36 అనే ఉపగ్రహానికి దగ్గరగా వెళ్లినట్లు సమాచారం. ఈ రెండు ఉపగ్రహాలు అంతరిక్షంలో ప్రయాణించే సమయంలో రష్యా ఉపగ్రహం తన కక్ష్యను అడ్జస్ట్ చేసుకుని, ICEYE-X36 ఉపగ్రహం ప్రయాణిస్తున్న కక్ష్యకు దగ్గరగా వచ్చినట్లు నివేదికలు వెల్లడించాయి.