(హాలుని ‘గాథా సప్తశతి’ ఆధారంగా రూపొందించిన ప్రణయ గాథ. 59వ భాగం)
మరొక్క క్షణమైతే జయసేనుని గొంతు ఈసాణుడి చేతుల మధ్య పూర్తిగా నలిగిపోతుందనగా… “జయము మహారాజా!” అన్నాడు.. వందన సూచకంగా విదగ్ధుడు, హఠాత్తుగా పరుగెత్తుకుంటూ వచ్చి. మరుక్షణం అక్కడి పరిస్థితి చూసి, ఒరలో నుంచి కత్తి తీసి, జయసేనుని తలను ఖండించబోయినాడు. సరిగ్గా అదే సమయానికి జయసేనుణ్ని దూరంగా నెట్టేస్తూ లేచి కూర్చున్నాడు ఈసాణుడు. విదగ్ధుని ఖడ్గం నిర్దాక్షిణ్యంగా ఈసాణుని తలను మొండెం నుంచి వేరు చేసింది. ఈ హఠాన్ పరిణామానికి నోట మాట రాక కుప్పకూలిపోయినాడు విదగ్ధుడు. ఆ దృశ్యం చూసిన జయసేనుడు… “హుఁ! ఎవడు తీసుకున్న గోతిలో వాడే పడటం అంటే ఇదే! ఇటువంటి దుర్మార్గునికి సాయం చేసిన నీవు కూడా బతకడానికి అనర్హుడవే!” అంటూ…