శ్రీనగర్: ఒక సీనియర్ ఆర్మీ అధికారి భార్య, చైనాతో సహా విదేశీ నిఘా ఏజెంట్ల ఉచ్చులోపడ్డారు. విద్యావేత్తల ముసుగులో ఆమెను సంప్రదించిన గూఢచార సంస్థలకు చెందిన ఏజెంట్లకు సున్నితమైన సమాచారాన్ని చేరవేశారు. ఈ నేపథ్యంలో ఆర్మీ అధికారి భార్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (Army Officer’s Wife Shared Info) తెలంగాణకు చెందిన ఒక మహిళ, జమ్ముకశ్మీర్లో విధులు నిర్వహిస్తున్న ఒక సీనియర్ ఆర్మీ అధికారి భార్య. అయితే కొంతమంది చైనా, విదేశీ గూఢచారులు విద్యావేత్తల ముసుగులో ఆమెను సంప్రదించారు. ప్రచురణ కోసం వ్యూహాత్మక, దేశ రక్షణకు ప్రాముఖ్యత ఉన్న అంశాలపై వ్యాసాలు, కథనాలు ఆమెతో రాయించారు.
కాగా, చైనాతో సహా విదేశీ గూఢచార సంస్థలకు చెందిన ఆ ఏజెంట్లు మొదట ఆర్మీ అధికారి భార్యతో పర్యావరణం, భౌగోళిక రాజకీయాలకు సంబంధించిన అంశాలపై ఆర్టికల్స్ రాయించారు. ఆ తర్వాత మెల్లగా రక్షణ రంగానికి సంబంధించిన అంశాల వైపు ఆమెను మళ్లించారు. అయితే విద్యావేత్తల ముసుగులో తనను సంప్రదించిన వారు వాస్తవానికి సున్నితమైన సమాచారాన్ని సేకరించేందుకు ప్రయత్నిస్తున్న గూఢచారులని ఆమె గ్రహించలేకపోయారు. దీంతో ఆమెకు తెలియకుండానే దేశ రక్షణకు సంబంధించిన కీలక సమాచారాన్ని వారికి చేరవేశారు.