పారిస్:ప్రజాందోళనలతో యూరప్ అట్టుడుకుతున్నది. పెరుగుతున్న జీవన వ్యయం, మౌలిక సదుపాయాల లేమి, పెరుగుతున్న ఇళ్ల ధరలు, నిరుద్యోగం, ప్రభుత్వ వైఫల్యాలపై అనేక దేశాల్లో నిరసనలు వెల్లువెత్తాయి. ఫ్రాన్స్, అల్బేనియాలో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఇటలీ, పోర్చుగల్, బెల్జియంలలో నిరసనలు జరుగుతున్నాయి.
అల్బేనియా అల్లకల్లోకం అల్బేనియా రాజధాని టిరానాలో ప్రధాని ఎడి రామా రాజీనామా చేయాలంటూ ఐదోరోజూ నిరసనలు కొనసాగాయి. ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు, పెట్రోల్ బాంబులు, మోలోటోప్ కాక్టెయిల్స్, బాణసంచా విసరగా, పోలీసులు బాష్పవాయువు, వాటర్ కెనాన్లు, లాఠీలతో స్పందించారు. ఈ వారంలో తొలిసారిగా రబ్బరు బుల్లెట్లను ప్రయోగించినట్టు వార్తాసంస్థలు వెల్లడించాయి. విద్యార్థులు కూడా ఉద్యమంలో చేరడంతో ఉద్రిక్తతలు పెరిగాయి.