Bastar Dussehra | దసరా అనగానే చాలామందికి గుర్తొచ్చేది శ్రీరాముడు రావణుడిపై సాధించిన విజయానికి ప్రతీకగా నిర్వహించే రావణ దహనం. కానీ ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలో మాత్రం దసరా వేడుకలు దీనికి భిన్నంగా ఉంటాయి. ఇక్కడ రావణుడి దిష్టిబొమ్మను దహనం చేయరు. శ్రీరాముడు, రావణుడి కథ కంటే స్థానిక ఆరాధ్య దైవమైన దంతేశ్వరి అమ్మవారి పూజలు, గిరిజన సంప్రదాయాలు, దేవతల ఊరేగింపులు ఈ ఉత్సవంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఒక్కటి రెండు రోజులు కాదు.. దాదాపు 75 రోజులపాటు సాగే ఈ వేడుక భారతీయ పండుగల వైవిధ్యానికి ప్రత్యేక ఉదాహరణగా నిలుస్తోంది.
దేశంలోని అనేక ప్రాంతాల్లో విజయదశమి రోజున రావణ దహనం నిర్వహిస్తారు. అయితే బస్తర్ దసరా ప్రధాన ఉద్దేశం రావణుడిపై శ్రీరాముడు సాధించిన విజయాన్ని జరుపుకోవడం కాదు. స్థానిక గిరిజన సమాజాల ఆరాధ్య దేవతలు, ముఖ్యంగా మా దంతేశ్వరి అమ్మవారిని పూజించడం ఈ వేడుకకు కేంద్రబిందువు. బస్తర్ ప్రాంత ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసాలు, గిరిజన ఆచారాలు, స్థానిక దేవతల సంప్రదాయాలతో ఈ పండుగ ముడిపడి ఉంది. అందుకే దేశంలోని ఇతర ప్రాంతాల్లో కనిపించే రావణ దహనం ఇక్కడి వేడుకలో భాగం కాదు. ఇది రావణుడిని గౌరవించడం లేదా శ్రీరాముడిని తిరస్కరించడం అనే అర్థం కాదు. స్థానిక సంస్కృతి, ఆరాధనా విధానం వేరుగా ఉండటమే ఈ ప్రత్యేకతకు కారణం.