ఇండియన్ ఆర్మీకి సొంత శాటిలైట్ అందుబాటులోకి రానుంది. శాటిలైట్ కమ్యూనికేషన్ కోసం ఇన్నాళ్లుగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) పైనే ఆధారపడుతూ వస్తున్న ఆర్మీకి.. ఇక నుంచి సొంత కమ్యూనికేషన్ నెట్ వర్క్ సేవలు అందించనుంది. ఈ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే శత్రువు కలుగులో దాక్కున్నా గుర్తించే అవకాశం ఉంటుంది. భారత సైనికులకు అనునిత్యం కాచుకుంటూ ఎప్పటికప్పుడు సమాచారం అందించే నెట్ వర్క్ త్వరలో ప్రారంభం కానుంది.
భారత సైన్యానికి ప్రత్యేకంగా రూపొందిస్తున్న తొలి కమ్యూనికేషన్ ఉపగ్రహం జీశాట్-7బీ (GSAT-7B)ను 2028 లో అంతరిక్షంలోకి ప్రయోగించనున్నారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ఈ అత్యాధునిక ఉపగ్రహాన్ని ప్రయోగించనుందని రక్షణ శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు.