పశ్చిమ బెంగాల్లో దుర్గా పూజ ఉత్సవాలు ప్రారంభం కావడానికి ముందే సిలిగురిలో కొత్త వివాదం తెరపైకి వచ్చింది.బిర్యానీ, మాంసం వంటి ఆహార పదార్థాలను హిందువులు నిర్వహించే దుకాణాల నుంచే కొనుగోలు చేయాలని కోరుతూ నగరంలోని పలు ప్రాంతాల్లో పోస్టర్లు వెలిశాయి.హిందూ జాగరణ్ మంచ్ పేరుతో కనిపించిన ఈ పోస్టర్లు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి.పండుగ సమయంలో మతం ఆధారంగా కొనుగోళ్లు చేయాలని పిలుపునివ్వడంపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.
హిందూ దుకాణాల్లోనే కొనాలంటూ పోస్టర్లుసిలిగురిలోని పలు ప్రాంతాల్లో అంటించిన పోస్టర్లపై బిర్యానీ తినడంపై నిషేధం లేదు.. కానీ హిందూ దుకాణాల నుంచే కొనండి, మాంసాన్ని హిందూ దుకాణాల్లోనే కొనుగోలు చేయండి అనే సందేశాలు ఉన్నాయి.ముఖ్యంగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి, సిలిగురి ఎమ్మెల్యే శంకర్ ఘోష్ నివాసానికి సమీపంలోని భారత్ నగర్ తరుణ్ తీర్థ క్లబ్ దుర్గా పూజ పండాల్ వద్ద ఈ పోస్టర్లు ఎక్కువగా కనిపించాయి. దీంతో ఈ వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశమైంది.