రష్యాలో టెక్ దిగ్గజం యాండిక్స్ డేటా సెంటర్లపై ఉక్రెయిన్ జరిపిన దాడులు అక్కడి ప్రజల దైనందిన జీవితాన్ని తీవ్రంగా అతలాకుతలం చేశాయి. మన దేశంలో గూగుల్ ఎంత కీలకమో.. రష్యాలో 'యాండిక్స్' కూడా అంతే ప్రాముఖ్యత కలిగిన సంస్థ. చెల్లింపులు, ట్యాక్సీ బుకింగ్‌లు, ఫుడ్ డెలివరీ, క్లౌడ్ స్టోరేజ్, చివరకు ఇళ్ల డిజిటల్ లాకింగ్ సిస్టమ్స్ అన్నీ ఈ కంపెనీపైనే ఆధారపడి ఉన్నాయి. అక్టోబర్ 8 నుంచి ఉక్రెయిన్ జరిపిన వరుస దాడుల్లో యాండిక్స్ ప్రధాన డేటా కేంద్రాలు దెబ్బతినడంతో.. రష్యా ప్రజలు ఒక్కసారిగా కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని దుస్థితికి చేరుకున్నారు.
డబ్బులున్నా.. చేతికి అందక అరిగోస: ఈ డిజిటల్ అంతరాయం వల్ల రష్యా ప్రజలు పడిన ఇబ్బందులు వర్ణనాతీతం. యాండిక్స్ పే సేవలు నిలిచిపోవడంతో వేలాది మంది తమ సేవింగ్స్ అకౌంట్స్, బ్యాంకు బ్యాలెన్స్‌లను యాక్సెస్ చేయలేకపోయారు. సెయింట్ పీటర్స్బర్గ్కు చెందిన 21 ఏళ్ల ఇరినా అనే యువతి తన అద్దె చెల్లించే సమయంలో ఈ సమస్యను ఎదుర్కొంది. "నా దగ్గర డబ్బు ఉంది, కానీ దాన్ని వాడుకునే పరిస్థితి లేదు. ఆ సమయంలో తిండి కోసం కూడా ఇబ్బంది పడ్డాను" అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. మరికొందరు తమ ఈఎంఐ చెల్లింపులు కూడా చేయలేని పరిస్థితి ఉందని తమ ఖాతాల్లో డబ్బులు ఉన్నప్పటికీ అని వెల్లడించారు.