Devaragattu Banni Utsavam | దసరా వచ్చిందంటే దేశవ్యాప్తంగా రావణ దహనాలు, అమ్మవారి పూజలు, జమ్మి పంచుకోవడం వంటి వేడుకలే కనిపిస్తాయి. కానీ ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా దేవరగట్టులో మాత్రం విజయదశమి రాత్రి ఓ విభిన్నమైన సంప్రదాయం కొనసాగుతోంది. ఆ రోజు వేలాది మంది భక్తులు ఒక్కచోట చేరి, ఉత్సవ విగ్రహాలను తమ గ్రామానికి తీసుకెళ్లేందుకు కర్రలతో తలబడుతుంటారు. ఈ క్రమంలో గాయాలై రక్తం కారుతున్నా వారు వినక్కి తగ్గరు. మరి ఆ బన్నీ ఉత్సవం గురించి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..!
కర్నూలు జిల్లా హొళగుంద మండలంలోని దేవరగట్టులో శ్రీ మాలమల్లేశ్వర స్వామి ఆలయం వద్ద బన్నీ ఉత్సవం నిర్వహిస్తారు. విజయదశమి సందర్భంగా జరిగే ఈ వేడుకకు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. స్థానిక సంప్రదాయం ప్రకారం శరన్నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక పూజల అనంతరం విజయదశమి రాత్రి స్వామి వారి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకొస్తారు. ఆ సమయంలో వివిధ గ్రామాలకు చెందిన భక్తులు రెండు వర్గాలుగా విడిపోయి విగ్రహాలను తమ గ్రామానికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో బన్నీ ఉత్సవంలో ప్రధాన ఘట్టమైన కర్రల పోరు మొదలవుతుంది.