హుస్నాబాద్/ కోహెడ, వెలుగు: ఎల్‌నినోతోనే కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని, దీనికి ప్రభుత్వం కారణం కదని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. పంట కాలం ముగిసే వరకు రాత్రివేళల్లోనూ నాణ్యమైన కరెంట్ సరఫరా చేస్తామని అన్నారు. శనివారం సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్‌లోని ఎల్లమ్మ చెరువు వద్ద బతుకమ్మ పండుగ ఏర్పాట్లు, చెరువు సుందరీకరణ, మైసమ్మ ఆలయ నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడుతూ హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రానికే ఆదర్శంగా నిలపడమే లక్ష్యమన్నారు. నీరు, విద్యుత్‌ను…
ఎల్లమ్మ చెరువును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నామని, గ్లాస్ బ్రిడ్జి, అర్బన్ ఫారెస్ట్ పార్క్ పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు. కప్పగుట్టను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడంతో పాటు యువత కోసం కబడ్డీ అకాడమీని అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. బతుకమ్మ వేడుకలకు వచ్చే మహిళలకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. చెరువు ఘాట్ వద్ద పటిష్టమైన బారికేడ్లు, హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎల్లమ్మ, ఆరేపల్లి చెరువుల వద్ద ఏర్పాట్లు పూర్తి చేశామని, ప్రజలు కుటుంబ సమేతంగా వేడుకల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.