హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎల్నినో ముప్పుతో ముంచుకొస్తున్న కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు, తగిన నివారణ చర్యలను సిఫారసు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నతస్థాయి కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చైర్మన్గా ఆరుగురు మంత్రులతో కూడిన మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమిస్తూ సీఎస్ సంజయ్ జాజు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా 315 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొనడం, ప్రాజెక్టుల్లో నీటిమట్టాలు పడిపోవడం, విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయికి చేరిన నేపథ్యంలో సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నది. వ్యవసాయం, తాగునీరు, విద్యుత్, పశుసంవర్ధక రంగాలపై ఎల్నినో చూపే విపరిణామాలను నిశితంగా అంచనా వేయడమే ఈ కమిటీ ప్రధాన బాధ్యత. అత్యవసర ప్రణాళికతోపాటు కేంద్ర ప్రభుత్వం నుంచి కరువు సహాయక నిధులను రాబట్టేందుకు అవసరమైన కార్యాచరణను రూపొందించే విస్తృత అధికారాలను ఈ సబ్ కమిటీకి ప్రభుత్వం కట్టబెట్టింది.