Instagram Reels | సోషల్ మీడియా రీల్స్ పిచ్చి ఎంత ప్రమాదకరంగా మారుతుందో తెలిపే ఘటన ఒకటి నెట్టింట చర్చనీయాంశమైంది. బీచ్లో భార్యాభర్తలు రీల్స్ చిత్రీకరిస్తుండగా.. వారి చిన్నారి సముద్రపు అలల మధ్య చిక్కుకుంది. కెమెరా ముందు వీడియోలు తీసుకోవడంలో నిమగ్నమైన తల్లిదండ్రులు పాపను పట్టించుకోలేదు. అయితే, అక్కడే ఉన్న ఓ యువకుడు వెంటనే స్పందించి చిన్నారిని కాపాడటంతో పెను ప్రమాదం తప్పింది.
వైరల్ అవుతున్న వీడియోలో కనిపిస్తున్న దృశ్యాల ప్రకారం.. ఓ జంట బీచ్లో సెల్ఫీ స్టిక్ సాయంతో రీల్స్ చిత్రీకరిస్తోంది. అదే సమయంలో వారి చిన్నారి సముద్రపు అలల సమీపంలో ఒంటరిగా ఉండిపోయింది. అలల తాకిడికి పాప నీటిలోకి కొట్టుకుపోతుండగా.. తల్లిదండ్రులు మాత్రం వీడియో చిత్రీకరణలోనే నిమగ్నమైనట్లు కనిపిస్తోంది.