JCJ Results | పెద్దపల్లి రూరల్, అక్టోబర్ 16: పట్టుదలతో చదివితే లక్ష్యాలను చేరుకోవచ్చని నిరూపించారు పెద్దపల్లి మండలానికి చెందిన ఇద్దరు యువతులు. ఇటీవల విడుదలైన జూనియర్ సివిల్ జడ్జి పరీక్షా ఫలితాల్లో ప్రతిభ చాటి న్యాయమూర్తులుగా ఎంపికై అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. వీరిలో వేముల హారిక ప్రత్యేకంగా నిలిచారు. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ)గా ఎంపికైన మూడు రోజుల వ్యవధిలోనే జూనియర్ సివిల్ జడ్జిగా కూడా ఎంపికై మరో విజయాన్ని సొంతం చేసుకున్నారు.
పెద్దపల్లి మండలం రాఘవాపూర్ గ్రామానికి చెందిన వేముల వైకుంఠం, లక్ష్మి దంపతుల కుమార్తె వేముల హారిక ఇటీవల ఏపీపీ పరీక్షల్లో ప్రతిభ కనబరిచి ఆ పోస్టుకు ఎంపికయ్యారు. ఆ ఆనందం నుంచి తేరుకోకముందే గురువారం విడుదలైన జూనియర్ సివిల్ జడ్జి పరీక్షా ఫలితాల్లోనూ సత్తా చాటి న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. మూడు రోజుల వ్యవధిలోనే రెండు కీలక విజయాలు సాధించడంతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.