కూకట్పల్లి: హైదరాబాద్లోని జేఎన్టీయూలో గత నెలలో జరిగిన ఘర్షణకు సంబంధించి 27 మంది విద్యార్థులపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ జి.వి.నరసింహరెడ్డి తెలిపారు. ఈ ఘటనపై ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక ఆధారంగా.. వసతిగృహం, కళాశాల నిబంధనలను ఉల్లంఘించినందుకు వీరిపై చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.
ఐదుగురు బీటెక్ మూడో ఏడాది విద్యార్థులను తదుపరి విద్యా సంవత్సరం మొత్తం వసతిగృహం నుంచి, ఆరు నెలలు కళాశాల నుంచి సస్పెండ్ చేశారు. మూడో ఏడాది విద్యార్థులు ముగ్గురిని (నాన్ బోర్డర్లు) ఎనిమిది నెలలు కళాశాల నుంచి, ఒక విద్యార్థిని నాలుగు వారాలు వసతిగృహం, కళాశాల, మరో 12 మందిని రెండు వారాలు కళాశాల, వసతిగృహం నుంచి సస్పెండ్ చేశారు. మరో ఇద్దరు మూడు, నాలుగో ఏడాది విద్యార్థులను (నాన్ బోర్డర్స్) కళాశాల నుంచి 4 వారాలు, ఎంటెక్ విద్యార్థి (నాన్ బోర్డర్) ఎనిమిది నెలలు కళాశాల నుంచి సస్పెండ్ చేశారు. ఈ సమయంలో పరీక్షలు, ప్రాజెక్టులకు కూడా అనుమతి నిరాకరించారు.