టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున కెరీర్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్'కింగ్ 100'. ఇప్పటికే నాగార్జున 100 వ సినిమాగా రూపుదిద్దుకుంటున్న నేపథ్యంలో దీనిపై అంచనాలు భారీగానే నెలకొన్నాయి. లేటెస్ట్ గా ఈ మూవీకి సంబంధించిన కీలక అప్డేట్ వచ్చేసింది. సీనియర్ నటి టబు ఈ చిత్రంలో అత్యంత శక్తిమంతమైన ప్రతినాయిక పాత్రలో కనిపించనుంది. ఆమె పాత్రను పరిచయం చేస్తూ దసరా పండుగ సందర్భంగా ప్రత్యేకమైన పవర్ఫుల్ గ్లింప్స్‌ను విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
దాదాపు 28 ఏళ్ల తర్వాత నాగార్జున, టబు కలిసి తెరపై కనిపించనుండటం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. గతంలో 'నిన్నే పెళ్లాడుతా' వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ఈ జోడీ.. ఈసారి మాత్రం ప్రేమకథతో కాకుండా, హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ముఖ్యంగా నాగార్జునకు జోడీగా కాకుండా, ఆయనను ఢీకొట్టే బలమైన ప్రతినాయికగా టబు కనిపించనుండటం మరింత ఆసక్తిని పెంచుతోంది.