కొవ్వూరు: తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో తెలుగుదేశం పార్టీ రాజకీయాలు వేడెక్కాయి. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి ఎంపిక వ్యవహారం స్థానిక టీడీపీలో తీవ్ర విభేదాలకు దారితీసింది. తొలుత ఖరారు చేసిన అభ్యర్థిని కొద్ది గంటల్లోనే మార్చడంతో కార్యకర్తల్లో అసంతృప్తి వ్యక్తమైంది. ఈ క్రమంలో పార్టీ కార్యాలయంలో ఫర్నిచర్ ధ్వంసం జరిగినట్లు సమాచారం.
కొవ్వూరు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా తొలుత కంఠమణి విజయలక్ష్మి పేరును ఖరారు చేసి, ఆమెతో నామినేషన్ వేయించారు. అయితే, ఆ తర్వాత పార్టీ అధిష్టానం రెండో జాబితాను విడుదల చేసి అభ్యర్థిని మార్చినట్లు తెలుస్తోంది. కంఠమణి విజయలక్ష్మి స్థానంలో జొన్నలగడ్డ రాధారాణి పేరును ప్రకటించడంతో పార్టీలో విభేదాలు మరింత ముదిరాయి.