KTR | వచ్చేటప్పుడు కరీంనగర్లో హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే సతీశ్ బాబు ఆపితే అక్కడ కొద్దిసేపు ఆగిన. ఏం సంగతి ఏమో గడ్డం పెంచినవ్ అని అడిగిండు. పోయేదెక్కడికి గోదావరి ఖనికి.. ఆ మాత్రం ఉండాలే కదా అని చెప్పిన. పోయేది సింగరేణికి కదా ఆ మాత్రం ఉండాలే.. లేకపోతే నడువదు అని చెప్పిన అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గోదావరి ఖని సింగరేణి స్టేడియంలో ’సింగరేణి కార్మిక గర్జన’లో కేటీఆర్ మాట్లాడుతూ.. పోరాటాల పురిటి గడ్డ రామగుండం అంటేనే రణగర్జన చేసే రణరంగం ఈ గడ్డ. నల్లబంగారు గనుల నుంచి తరలివచ్చిన మా కార్మిక అన్నలందరికీ హృదయపూర్వక వందనం. చెమట, నెత్తురు దారపోసి ఈ దేశానికి విద్యుత్ అందించి…
సింగరేణిది 137 ఏండ్ల చరిత్ర. ఈ నాటిది కాదిది. కార్మికుల త్యాగముఉన్నది.. కార్మికుల కష్టమున్నది. నల్లబొగ్గుకు నెత్తురు అద్ది ఎన్నో సందర్భాల్లో ప్రాణాలు కోల్పోయిన కార్మికులున్నారు. అవిటివాళ్లైన వాళ్లున్నరు. చీకటి గుహల్లో రక్తతర్పనం చేసినవాళ్లున్నారు. ఎన్నో త్యాగాలు చేసినవాళ్లున్నారు. ఎన్నో త్యాగాలు చేసిన వేలాది కార్మికుల కుటుంబాలున్నాయి. చావుతో సహవాసం చేసే సత్తా ఉన్న కార్మిక సోదరులు ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నరా.. అంటే మన సంగిరేణిలోనే ఉన్నరని గర్వంగా చెప్పుకోవచ్చునన్నారు.