సిద్దిపేట, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేండ్లయినా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు జీతాలు పెంచకుండా నిర్లక్ష్యం చేస్తున్నదని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ తన్నీరు హరీశ్‌రావు మండిపడ్డారు. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నా వారి జీతాలు మాత్రం పెరుగక ఇంటి అద్దెలు, విద్యుత్ బిల్లులు, రవాణా ఖర్చులతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా తక్షణమే కార్మికుల జీతాలు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదే విధంగా ఇతర మున్సిపల్ విభాగాల కార్మికులకూ గ్రూపు విధానాన్ని వర్తింపజేయాలని రాబోయే…
కాంగ్రెస్ పాలనలో కార్మికులకు ఎప్పుడూ కష్టాలేనని హరీశ్‌రావు విమర్శించారు. నాటి రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో పారిశుద్ధ్య కార్మికులకు మూడు, ఐదు, ఆరు నెలలపాటు జీతాలు అందని పరిస్థితులు ఉండేవని దుయ్యబట్టారు. వేతనాల కోసం కార్మికులు ఎర్రజెండాలు పట్టుకొని ఆర్డీవో కార్యాలయాలు, మున్సిపల్ కమిషనర్ కార్యాలయాల ఎదుట ధర్నాలు చేయాల్సి వచ్చేదని ఆయన గుర్తుచేశారు. అప్పట్లో ఔట్ సోర్సింగ్ కార్మికులకు వేతనం రూ.8,300 మాత్రమే ఉండేదని, కాంట్రాక్టర్ల ప్రమేయంతో జీతాలు సకాలంలో అందడంలోనూ ఇబ్బందులు ఎదురయ్యేవని పేరొన్నారు.