పాట్నా: బీహార్లో జేడీయూ ఎమ్మెల్యే అనంత్కుమార్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి రాష్ట రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టించారు. మాజీ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కోసం తొమ్మిది మంది ప్రాణాలు తీశానని ప్రకటించిన ఆయన కొద్ది సేపటికే యూటర్న్ తీసుకున్నాడు. మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్పై ఆ వ్యాఖ్యలు చేసినట్టు పేర్కొన్నాడు. ‘నితీశ్ కోసం చేసిన తొమ్మిది హత్యల్లో నేనే సూత్రధారిగా వ్యవహరించాను’ అంటూ ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని జేడీయూ పేర్కొంది. రాబోయే శాసనమండలి ఎన్నికల్లో తన రాజకీయ విరోధి నీరజ్ కుమార్ను పార్టీ రంగంలోకి దింపడంతో ఆగ్రహంతో ఆయన ఈ ఆరోపణలు చేశాడు.
‘నితీశ్ కుమార్తో నాకు చాలాకాలంగా పరిచయం ఉంది. అతనికి సహాయం చేయడం కోసం నేను తొమ్మిది హత్యలకు కారణమయ్యాను. ఆయన తన స్థానాన్ని నిలబెట్టుకోవడానికి కష్టాలు పడుతున్న సమయంలో ఆయనకు సహాయంగా ఉన్నాను’ అని అనంత్కుమార్ తెలిపారు. ‘ తొమ్మిది హత్యలు చేసినట్టు సింగ్ ఒప్పుకున్నాడు. అయితే తర్వాత పార్టీ ఒత్తిడో, కేంద్రం బలవంతం మీదో ఆయన తన ప్రకటనను వాపసుతీసుకోవచ్చు. అంతమాత్రాన కరుడుగట్టిన క్రిమినల్ గ్యాంగులతో అంటకాగుతూ నితీశ్ కుమార్ ముఖ్యమంత్రిగా పాలన సాగించిన విషయం నిజం కాకుండా పోతుందా?’ అని ఆర్జేడీ నేత శక్తి సింగ్ యాదవ్ ప్రశ్నించారు.