చండీఘర్: పంజాబ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సంగ్రూర్ జిల్లాలోని లెహ్రాగాగా-జాఖర్ రహదారిపై కారు ఢీకొనడంతో ఎనిమిది మంది ఉపాధి హామీ కూలీలు మృతి చెందారు. మరికొందరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న ఉన్న కార్ డ్రైవర్ ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు.
ప్రత్యక్ష సాక్షి కథనం ప్రకారం.. ఆదివారం (అక్టోబర్ 18) లెహ్రాగాగా-జాఖర్ రహదారి పక్కన 25 మంది ఉపాధి హామీ కూలీల బృందం పని చేస్తోంది. కార్మికులు పనిలో నిమగ్నమై ఉండగా హైవేపై నుంచి అతి వేగంగా వచ్చిన కారు కార్మికుల గుంపుపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు కార్మికులు అక్కడికక్కడే మరణించగా.. మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఘటన స్థలానికి అంబులెన్స్ ఆలస్యంగా రావడం వల్లే కూలీలు మరణించారని ప్రత్యక్ష సాక్షి ఆరోపించారు.