ఈతరం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. 10 మంది యువతలో 5 మందికి పైగానే అప్పుల తిప్పలు పడుతున్నారు. ఒక్కొక్కరివి వేరు వేరు అవసరాలు. బాధ్యతల బరువులు మోస్తూ అప్పులు చేస్తూ వాటిని తీర్చుతూ తిప్పలు పడుతున్నది కొందరైతే.. జల్సాలకు అలవాటు పడి ఆన్లైన్ బెట్టింగ్లు, సినిమాలు షికార్ల కోసం అప్పులు చేస్తున్నది మరికొందరు. బాధ్యతలను చక్కబెట్టేందుకు అప్పులు చేస్తూ వాటిని సకాలంలో తీర్చే వాళ్లతో ఎలాంటి సమస్య లేదు. వాళ్ల అప్పుల గురించి ఇళ్లలో కూడా తెలిసే ఉంటుంది. అప్పులు తీరిపోయాక పెళ్లి చేసుకుందామనే క్లారిటీతో ఉంటారు. కానీ.. మరికొందరు మాత్రం ఇంట్లో వాళ్ల దగ్గర వ్యక్తిగత అప్పుల గురించి దాచి పెళ్లి చేసుకుంటారు.
పెళ్లి తర్వాత నమ్మి తన జీవితంలోకి వచ్చిన భార్యకు కూడా అప్పుల గురించి చెప్పరు. పాత అప్పులు తీర్చడానికి కొత్త అప్పులు చేస్తుంటారు. లోన్ యాప్స్ అని, బ్యాంకు లోన్లు అని భార్యకు తెలియకుండా నానా తిప్పలు పడుతుంటారు. ఏదో ఒకరోజు భార్యకు నిజం తెలిసి నమ్మక ద్రోహం చేశారని ఆమె గుండె బద్ధలైపోతుంది. లక్షల్లో అప్పులు చేసి పెళ్లి తర్వాత కూడా భార్యకు తెలియకుండా మేనేజ్ చేస్తూ అప్పులు తీర్చడానికి కొత్త అప్పులు చేస్తున్న భర్తలు మన దేశంలో చాలా మందే ఉన్నారు.