Plague Disease | అప్పట్లో.. అంటే.. 14వ శతాబ్దంలో ఐరోపాలో కోట్లాది మంది ప్రాణాలను బలిగొన్న ప్లేగు వ్యాధి ఇప్పటికీ పూర్తిగా అంతరించిపోలేదు. అయితే, ప్రస్తుతం ఈ వ్యాధిని యాంటీబయాటిక్ మందులతో సమర్థవంతంగా నయం చేసే అవకాశం ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం, 1990వ దశకం నుంచి ప్లేగు బారిన పడిన వారిలో ఎక్కువ మంది ఆఫ్రికా దేశాలకు చెందినవారే. ముఖ్యంగా కాంగో, మడగాస్కర్లో కేసులు అధికంగా నమోదయ్యాయి. అమెరికాలోనూ ఏటా సగటున ఏడుగురికి ఈ వ్యాధి సోకుతున్నట్లు అంచనా. అక్కడ గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువ కేసులు కనిపిస్తున్నాయి.
ఇటీవల సైబీరియాలోని ప్లేగు పరిశోధనా సంస్థలో పనిచేసే ఓ ఉద్యోగిని న్యుమోనియాతో మరణించడం రష్యాలో ఆందోళనకు దారితీసింది. ఆమెకు న్యుమోనిక్ ప్లేగు సోకి మరణించినట్లు కొన్ని వార్తలు వచ్చినప్పటికీ, రష్యా అధికారులు నిర్వహించిన పరీక్షల్లో ప్లేగుకు సంబంధించిన ఆధారాలు లభించలేదని ప్రకటించారు. అయినప్పటికీ ముందుజాగ్రత్త చర్యగా పరిశోధనా సంస్థను తాత్కాలికంగా నిర్బంధించారు. సైబీరియా ప్రాంతంలో వేల సంవత్సరాలుగా ప్లేగు వ్యాధి ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. ఎలుకలు, ఇతర చిన్న క్షీరదాల్లో ఈ బ్యాక్టీరియా సహజంగా వ్యాప్తి చెందుతుంది. వ్యాధి సోకిన జంతువులపై ఉండే ఈగలు మనుషులను కుట్టడం ద్వారా సంక్రమణ జరుగుతుంది.