న్యూఢిల్లీ, అక్టోబర్ 19 : లంచం డిమాండ్ చేశాడని ప్రభుత్వ ఉద్యోగిపై వచ్చే ఆరోపణలపై అవినీతి నిరోధక చట్టం కింద విచారణ జరపడానికి ముందస్తు అనుమతి అవసరంలేదని సుప్రీంకోర్టు తెలిపింది. అటువంటి చర్య అధికారిక విధుల నిర్వహణకు సంబంధించినది కాదని, అందువల్ల ముందస్తు అనుమతి అవసరం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. తనపై అవినీతి అభియోగాన్ని నమోదు చేయడాన్ని వ్యతిరేకిస్తూ రాజస్థాన్‌కు చెందిన పోలీసు కానిస్టేబుల్ తేజారామ్ దాఖలు చేసిన అప్పీల్‌ను కొట్టివేస్తూ జస్టిస్ ఎస్వీఎన్ భట్టీ, జస్టిస్ యూఎన్వీ అంజరియాతో కూడిన ధర్మాసనం ఈనెల 16న తీర్పు వెలువరించింది. ధర్మాసనం తరఫున జస్టిస్ అంజరియా తీర్పును వెలువరిస్తూ…
2018లో సవరించిన ఈ చట్టంలోని సెక్షన్ 7 తమ ప్రభుత్వ విధులను అక్రమంగా లేదా అధర్మంగా నిర్వహించేందుకు అనుచిత ప్రయోజనాన్ని స్వీకరించే, పొందే లేదా పొందేందుకు ప్రయత్నించే ప్రభుత్వోద్యోగులకు శిక్షను విధిస్తుంది. కొన్ని నేరాలపై విచారణ లేదా దర్యాప్తు చేపట్టేందుకు చట్టంలోని సెక్షన్ 17ఏ ప్రకారం అధికారులు ముందస్తు అనుమతి పొందాల్సి ఉంటుందని, అయితే రద్యాప్తు సంస్థ ఈ ముందస్తు అనుమతిని పొందలేదన్న తేజారమ్ వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. గత తీర్పులను ఉటంకిస్తూ నిధుల దుర్వినియోగం, ఖాతాల్లో తప్పు నమోదులు, మోసం, నమ్మకద్రోహం, లంచం తీసుకోవడం వంటి నేరాలు సక్షన్ 17ఏ పరిధిలోకి రావని సుప్రీకోర్టు స్పష్టం చేసింది.