హైదరాబాద్: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్రెడ్డి (Revanth Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు చెప్పినా పరిస్థితుల్లో మార్పు రావడం లేదని.. విద్యుత్ అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో విద్యుత్ కొరత ప్రమాదం ఉన్నప్పటికీ.. ఉత్పత్తి పెంచడం లేదని మండిపడ్డారు. నైనీ, మహానది నుంచి బొగ్గు లింకేజీలున్నా.. ఆశించిన స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి ఎందుకు జరగడం లేదని ప్రశ్నించారు. సరఫరా సాఫీగా సాగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అంతకుముందు ముఖ్యమంత్రితో యూకే మేయర్ల బృందం భేటీ అయ్యింది. ఈ సందర్భంగా తెలంగాణలో యూకే పెట్టుబడులకు అవకాశాలపై చర్చించారు. యూకే- తెలంగాణ వాణిజ్య సంబంధాలను పటిష్ఠం చేసేలా.. వైద్యం, డిజిటల్ టెక్నాలజీ, రక్షణ, ఏరోస్పేస్, టెక్స్టైల్స్, పరిశోధన, తయారీ రంగాల్లో పరస్పర సహకారంపై చర్చించారు. ఈ సందర్భంగా యూకే ఇండియా బిజినెస్ కౌన్సిల్ ‘‘యూకే- ఇండియా సీఈటీఏ అండ్ రీజినల్ సినర్జీస్’’ నివేదికను సీఎం ఆవిష్కరించారు.