దేశంలోని కోట్లాది ప్రజల నమ్మకానికి ప్రతీకగా నిలిచే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భద్రతకు సంబంధించి ఓ సంచలన వార్త కస్టమర్లను కుదిపేస్తోంది. 'సిరియూసిమ్' అనే హ్యాకర్ గ్రూప్ SBIకి చెందిన దాదాపు 3.75 లక్షల మంది కస్టమర్ల సీక్రెట్ డేటాను దొంగిలించినట్లు ప్రముఖ సైబర్ సెక్యూరిటీ ఎకౌంట్ 'సైబర్పల్స్56' ఎక్స్ వేదికగా వెల్లడించింది. ఈ హ్యాకర్ల దగ్గర సుమారు 3లక్షల 75వేల అకౌంట్లకు సంబంధించిన వివరాలతో పాటు 2వేల722 పీడీఎఫ్ ఫైల్స్ ఉన్నట్లు సమాచారం.
ఈ డేటా లీక్‌లో ఖాతాదారుల వ్యక్తిగత సమాచారం, లోన్ అప్లికేషన్లు, వాటికి సంబంధించిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్, అకౌంట్ ఓపెనింగ్ దరఖాస్తులు, చిరునామాలు వంటి అత్యంత కీలకమైన వివరాలు ఉన్నట్లు సైబర్పల్స్56 తెలిపింది. ఇది ఈ డేటాకు సంబంధించి మొదటి లీక్ మాత్రమేనని హ్యాకర్లు పేర్కొన్నట్లు సమాచారం. అయితే ఈ లీకైన డేటా ఎంతవరకు నిజం, దీని మూలాలు ఎక్కడివి అనే అంశాలపై ఇంకా స్పష్టత రాలేదు. ఒకవేళ ఈ సమాచారం గనుక నిజమైతే, సైబర్ నేరగాళ్లు దీనిని ఉపయోగించి మోసపూరిత లోన్ దరఖాస్తులు చేయడం, ఐడెంటిటీ థెఫ్ట్, ఆర్థిక మోసాలు, టార్గెటెడ్ ఫిషింగ్ దాడులకు పాల్పడే ప్రమాదం ఉందని నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.