మాతృత్వ ప్రయాణంలో ప్రసవం అత్యంత కీలకమైన ఘట్టం. అయితే, కొన్ని సందర్భాల్లో తల్లి, బిడ్డ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వైద్యులు శస్త్రచికిత్స ద్వారా ప్రసవం చేయాలని సూచిస్తారు. దీనినే సిజేరియన్ ప్రసవం అంటారు. సిజేరియన్ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన అవసరం.
అసలు సిజేరియన్ ఎందుకు చేయాల్సి వస్తుందంటే.. తల్లికి అధిక రక్తపోటు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉండటం, మాయ గర్భసంచి ద్వారానికి దగ్గరగా ఉండటం, బిడ్డ అడ్డంగా లేదా కాళ్లు కిందికి ఉండటం, బిడ్డకు రక్తప్రసరణలో సమస్యలు రావడం, బిడ్డ సాధారణం కంటే చిన్నగా లేదా పెద్దగా ఉండటం, కవలలు ఉండటం వంటి కారణాలతో సిజేరియన్ అవసరం కావచ్చు. గతంలో సిజేరియన్ లేదా గర్భసంచికి సంబంధించిన శస్త్రచికిత్సలు జరిగినా వైద్యులు ప్రసవ విధానాన్ని జాగ్రత్తగా నిర్ణయిస్తారు.సహజ ప్రసవానికి ప్రయత్నిస్తున్నప్పుడు తల్లికి సంక్రమణ కారణంగా జ్వరం రావడం, బిడ్డ గుండె కొట్టుకునే వేగంలో మార్పులు కనిపించడం, గర్భసంచి ద్వారం తెరుచుకోకపోవడం, బిడ్డ తల కిందికి…