TGSRTC | ఆర్టీసీలో ఉద్యోగ విరమణ చేసినవారికి రావాల్సిన బకాయిలను త్వరగా చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఉద్యోగ విరమణ తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఎదురోకుండా, వారికి రావాల్సిన ప్రయోజనాలు అందించాల్సిన బాధ్యత సర్కార్పై ఉన్నది. అవసరమైతే సంస్థకు చెందిన విలువైన భూములను విక్రయించైనా రిటైర్డ్ ఉద్యోగులకు బకాయిలు చెల్లిస్తం.. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లిన..
హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ఆర్టీసీ ఆస్తుల అమ్మకానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైనట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉద్యోగుల బకాయిలు, రిటైర్డ్ ఉద్యోగుల సెటిల్మెంట్లు, ఇతర రాయితీలు, బకాయిలు వేల కోట్ల రూపాయల మేర పేరుకుపోవడంతో.. వాటిని చెల్లించలేక, ఆస్తులను అమ్మే దిశగా అడుగులు వేస్తున్నట్టు కార్మికులు భావిస్తున్నారు. రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం తనను కలిసిన ఆర్టీసీ గుర్తింపు సంఘం నాయకులతో చేసిన వ్యాఖ్యలు తమ అనుమానాలను బలపరుస్తున్నాయని అంటున్నారు.