చుక్క నీటిని కూడా వృథా చేయొద్దంటూ ప్రజలకు సుద్దులు చెప్పిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే.. ఒకటో, రెండో కాదు.. మూడున్నర నెలల్లో ఏకంగా 734 టీఎంసీల గోదావరి జలాలను వట్టిగ వదిలేసింది. కరువు తప్పదనే హెచ్చరికలు వచ్చినా.. సాగు, తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా పంపులను నడిపి నీటిని ఒడిసిపట్టాలని మొదటినుంచీ బీఆర్ఎస్ మొత్తుకుంటున్నా పెడచెవిన పెట్టింది.
రైతుల ఆక్రందనలను వినకుండా.. ప్రజల తాగునీటి గోసను పట్టించుకోకుండా నీళ్లన్నీ వృథాగా పోయాక తీరిగ్గా వచ్చి ‘మేమేం చేయలేం’ అంటూ సర్కార్ చేతులెత్తేసింది. కేవలం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు పేరొస్తుందనే ఒకే ఒక్క రాజకీయ కారణంతో కాళేశ్వరం నుంచి నీళ్లెత్తకుండా వందలాది టీఎంసీల గోదావరి నీటిని దిగువకు జారవిడిచింది. తీవ్ర కరువు ముంచుకొస్తున్న నేపథ్యంలో ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టకుండా, రైతులు, ప్రజల ప్రయోజనాలను బలిపెట్టి ఘోర వైఫల్యాన్ని మూటగట్టుకొన్నది.