హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో గురుకులాల్లో చేరేందుకు విద్యార్థులు పోటీపడేవారు. కానీ, కాంగ్రెస్ నిర్లక్ష్య విధానాలతో విద్యార్థుల డ్రాపౌట్ల సంఖ్య ఏటేటా భారీగా పెరిగిపోతున్నది. ఈ ఏడాది ఒక్క ఎస్సీ గురుకులాల్లోనే అడ్మిషన్ తీసుకున్నా దాదాపు 8వేల మంది విద్యార్థులు బడిలో చేరని పరిస్థితి నెలకొన్నది. ప్రస్తుతం నిర్వహిస్తున్న ఎస్ఏ-1 (సమ్మేటివ్ అసెస్మెంట్) పరీక్షల నేపథ్యంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అన్ని గురుకులాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొన్నదని ఉపాధ్యాయులు, విద్యార్థులు చెప్తున్నారు.
సగటున ఒక్కో గురుకులంలో 40 మంది విద్యార్థులు ఇండ్లకే పరిమితమయ్యారని తెలుస్తున్నది. ఇంటర్, డిగ్రీ గురుకుల కళాశాలల్లోనూ భారీగా సీట్లు మిగిలిపోయాయి. పరిస్థితి ఇంత అధ్వానంగా ఉన్నా రేవంత్ సర్కార్ పట్టించుకున్న పాపాన పోలేదు. మిగిలిన సీట్ల భర్తీ బాధ్యతను కలెక్టర్లకు అప్పగించి చేతులు దులుపుకొన్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, జనరల్ అన్నీ కలిపి దాదాపు 1,027 గురుకులాలు ఉన్నాయి. అందులో 5వ తరగతి నుంచి పదో తరగతి వరకు పాఠశాలలు, ఇంటర్, డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. మైనారిటీ గురుకులాలు మినహాయించి ఇతర సొసైటీలకు సంబంధించి 643 గురుకులాల్లో 5వ తరగతిలో 51,924 సీట్లు…