Mahabubnagar | యువకుల కార్ల రేసింగ్ ఓ మహిళ ప్రాణాన్ని బలిగొంది. రెండు థార్ కార్లతో రేసింగ్ చేస్తూ బైక్ను ఢీకొట్టడంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె భర్త తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషాద ఘటన మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని అమిస్తాపూర్లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. షాకీర్ తన భార్య షహానా బేగం (40), కుమార్తె ఆయారాతో కలిసి బంధువు వివాహానికి వెళ్లి బైక్పై తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో అమిస్తాపూర్ యూపీఎస్ పాఠశాల సమీపంలో రెండు థార్ కార్లతో రేసింగ్ చేస్తున్న యువకులు వారి బైక్ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో షహానా బేగం అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ప్రమాదంలో షాకీర్కు కాళ్లు, చేతులు విరిగి తీవ్ర గాయాలయ్యాయి. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. తల్లి ఒడిలో ఉన్న చిన్నారి ఆయారాకు స్వల్ప గాయాలయ్యాయి.