రాజసం ఉట్టిపడే రాజభవనం.. కళ్లుచెదిరే విద్యుద్దీపాల అలంకరణ.. మేళతాళాలు, జానపద కళారూపాల సందడి.. గజరాజుల గంభీర నడక.. ఇవన్నీ కలిస్తే మైసూరు దసరా ఉత్సవాల వైభవమే కనిపిస్తుంది. వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ వేడుకలు కర్ణాటక సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పడుతూ దేశవిదేశాల పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి.
కర్ణాటక రాష్ట్ర పండుగగా పేరొందిన మైసూరు దసరా ఉత్సవాలు ఈ ఏడాది అక్టోబర్ 11 నుంచి 21 వరకు11 రోజులపాటు జరుగుతున్నాయి. చాముండి కొండపై అమ్మవారి పూజలతో ప్రారంభమైన వేడుకలు నగరమంతా ఉత్సాహాన్ని నింపుతున్నాయి. రాజభవనంలో ఆయుధ పూజ, గజాశ్వ పూజ వంటి సంప్రదాయ ఆచారాలకు ప్రత్యేక స్థానం ఉంది. సాంస్కృతిక కార్యక్రమాలు, జానపద ప్రదర్శనలు, పుష్ప ప్రదర్శనలు, ఆహార మేళాలు సందర్శకులను అలరిస్తున్నాయి.