హుస్నాబాద్ నియోజకవర్గ రైతాంగానికి సాగునీటి సౌకర్యాలు మరింత మెరుగుపరిచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం దసరా కానుక అందించిందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (SRSP) పరిధిలోని ఇందిరమ్మ వరద కాలువ ప్యాకేజీ-3 పనులకు సంబంధించి ప్రభుత్వం జీవో నెం.518 (G.O.Rt.No.518, తేదీ: 19.10.2026) ద్వారా కీలక పరిపాలనా అనుమతులు మంజూరు చేసిందని వెల్లడించారు.
రైతులకు సాగునీరు అందించడంతో పాటు నీటిపారుదల వ్యవస్థను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి పేర్కొన్నారు. ఇందులో భాగంగా రూ.211.172 కోట్లతో వేరియేషన్ ఎస్టిమేట్-IIకు పరిపాలనా ఆమోదం లభించగా, మరోవైపు ఎడమ, కుడి ప్రధాన కాలువల్లో సీసీ లైనింగ్, అదనపు నిర్మాణాల కోసం రూ.40.779 కోట్లతో కొత్త టెండర్లు పిలిచేందుకు ప్రత్యేకంగా అనుమతి మంజూరైందని తెలిపారు.