రేవంత్రెడ్డీ..సింగరేణి కుంభకోణాలపై నేను ఉత్తరం రాస్తే విచారణకు ఆదేశిస్తానన్నవు కదా.. ఎస్.. నేను సిట్టింగ్ జడ్జితో విచారణకు రెడీ.. దమ్ముంటే వెంటనే జడ్జికి లేఖ రాయి. నేను ఆధారాలు సమర్పించి నువ్వు, నీ బామ్మర్ది, నీ సర్కార్ అక్రమాలను బట్టబయలు చేస్తా..
హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తేతెలంగాణ) : సింగరేణి సంస్థలో స్కామ్లపై సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు. జడ్జికి రేవంత్రెడ్డి లేఖ రాస్తే తాను పూర్తి ఆధారాలు సమర్పిస్తానని తేల్చిచెప్పారు. ‘బొగ్గు అంశంలోనే కాదు.. నువ్వు చేసిన అక్రమాలు, నీ బామ్మర్ది సృజన్రెడ్డి సింగరేణిలో కొల్లగొట్టిన రూ. 10 వేల కోట్ల కుంభకోణం, నువ్వు చేసిన పవర్ స్కామ్, విదేశీ బొగ్గు కొనుగోలు పేరిట సాగుతున్న కమీషన్ల బాగోతాన్ని కూడా బయటపెట్టేందుకు సిద్ధం’ అని ప్రకటించారు.