Eenadu ·
Meenakshi Chaudhary: భయమేసినా... మరో మార్గం కనిపించలేదు
‘‘హారర్ - మిస్టరీ థ్రిల్లర్ జానర్లో ఇప్పటికే ఎన్నో సినిమాలొచ్చినా ‘వృషకర్మ’ ప్రపంచం నాకొక సరికొత్త అనుభూతిని అందించింది’’ అన్నారు నటి మీనాక్షి చౌదరి. ఇది ప్రేక్షకులకు గొప్ప థియేట్రికల్ అనుభూతిని ఇచ్చే చిత్రం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఆమె.. నాగచైతన్య జంటగా నటించిన ఈ సినిమాని కార్తీక్ దండు తెరకెక్కించారు. డిసెంబరు 4న విడుదల కానున్న నేపథ్యంలో శుక్రవారం విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు మీనాక్షి.
‘‘హారర్, మిథికల్ అంశాల పట్ల ప్రేక్షకులకు ఓ అవగాహన ఉన్నా.. ‘వృషకర్మ’లోని విజువలైజేషన్, ట్రీట్మెంట్ విభిన్నంగా ఉంటాయి. ఓ బలమైన కథని వాణిజ్య అంశాలతో ఎలా మేళవించారన్నదే దీని ప్రత్యేకత. దర్శకుడు కార్తీక్ గత చిత్రం ‘విరూపాక్ష’ చూసిన వాళ్లకి ఇది ఇట్టే అర్థమైపోతుంది. అందులో ఉన్న మ్యాజిక్కే ఇప్పుడీ చిత్రంలోనూ కనిపిస్తుంది. ఈ సినిమాలో నేను దక్ష అనే ఆర్కియాలజీ విద్యార్థిగా కనిపిస్తా. కథ ముందుకు సాగుతున్న కొద్దీ ఈ పాత్ర ప్రయాణం ఆసక్తికర మలుపులు తిరుగుతుంది. ఈక్రమంలో తను ఈ సినిమాలోని మిగతా పాత్రలకు ఎలా తోడ్పడుతుందనేది ఆసక్తికరంగా ఉంటుంది’’.