V6 Velugu ·
టాక్సులు తగ్గించినా ఉద్యోగాలు ఇవ్వరా.. జీతాలు పెంచరా?: కంపెనీలకు మోడీ ప్రశ్నలు
పన్నుల భారం తగ్గించినా.. ఉద్యోగాలు ఇవ్వరా? జీతాలు పెంచరా? అంటూ భారతీయ కార్పొరేట్ కంపెనీలకు ప్రధాని మోడీ ప్రశ్నలు సంధించారు. ప్రభుత్వ సంస్కరణలు, భారీ పన్ను రాయితీల ఫలాలు సామాన్య ప్రజలకు, ఉద్యోగులకు ఎంతవరకు చేరాయో ఆత్మపరిశీలన చేసుకోవాలని బడా వ్యాపారవేత్తలకు సూచించారు. ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన ఫిక్కీ వార్షిక సర్వసభ్య సమావేశంలో ప్రసంగించిన ప్రధాని.. వ్యాపార సంస్థలను సామాజిక బాధ్యత, ఉద్యోగాల కల్పనపై నేరుగా నిలదీశారు.
కార్పొరేట్ రంగం తన లాభాలనే కాకుండా.. దేశ ఆర్థికాభివృద్ధిలో తన పాత్రను కూడా అంచనా వేసుకోవాలని మోడీ స్పష్టం చేశారు. ప్రభుత్వ పరంగా ఇచ్చిన ప్రోత్సాహకాలకు తగ్గట్టుగా ఉద్యోగాల కల్పన.. ఉద్యోగుల వేతనాల పెంపు, పెట్టుబడుల విషయంలో కంపెనీలు తగినంతగా తిరిగి చేశాయా లేదా అనే ప్రశ్నలను ప్రజల ముందుకు తెచ్చారు. ఆర్థిక వృద్ధి వేగంగా సాగుతున్న వేళ.. ఆ ఫలాలు క్షేత్రస్థాయిలో అందరికీ సమానంగా చేరాలంటే కార్పొరేట్ సంస్థల చొరవ ఎంతో అవసరమంటూ నిలదీశారు.