Namasthe Telangana ·
X Money | ఇక ఎక్స్ ద్వారా కూడా డబ్బులు పంపొచ్చు.. కొత్త ఫీచర్ ప్రకటించిన ఎలాన్ మస్క్..!
X Money : ఇక నుంచి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్ (X)’ ద్వారా కూడా డబ్బులు పంపించవచ్చు. ఈ మేరకు ఎక్స్ చీఫ్ (X Chief) ఎలాన్ మస్క్ (Elon Musk) తమ యూజర్ల కోసం ఆసక్తికరమైన ఫీచర్‌ను ప్రతిపాదించారు. ఎక్స్‌లో ఏదైనా పోస్ట్ నచ్చితే దాని కింద ఉన్న ‘లైక్ బటన్’ను లాంగ్ ప్రెస్ (Long press) చేయడం ద్వారా ఆ పోస్ట్ చేసిన వారికి ఒక డాలర్ (One Dollar) పంపే సౌకర్యాన్ని తీసుకువస్తున్నట్లు ఆదివారం ప్రకటించారు. ఈ ఫీచర్ ద్వారా సులభంగా చిన్న మొత్తంలో డబ్బు పంపించుకునే అవకాశం కలుగుతుంది.
ఎక్స్‌ను కేవలం సోషల్ నెట్వర్కింగ్ వేదికగానే కాకుండా ఫైనాన్షియల్ సర్వీసులతో కూడిన ఒక ‘ఎవ్రీథింగ్ యాప్’గా మార్చాలన్న మస్క్ విస్తృత వ్యూహంలో ఈ కొత్త ఫీచర్ ఒక భాగమని తెలుస్తున్నది. ఎక్స్ మనీ ద్వారా ఒకరికి 1 డాలర్ పంపడానికి, లైక్ బటన్‌పై లాంగ్ ప్రెస్ చేసే సదుపాయాన్ని తీసుకొస్తున్నామని మస్క్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ ఫీచర్ ముఖ్యంగా కంటెంట్ క్రియేటర్లకు టిప్స్ ఇవ్వడానికి, వినియోగదారులకు నచ్చిన పోస్టులను ఆర్థికంగా ప్రోత్సహించడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.